Tuesday, November 1, 2011

ఘోరకలి

కదనంరంగంలో నరకాన్ని తలపించే నరకుని ధాటికి
క్షత్రియవీరులు క్షతగాత్రులై శాస్త్రము నేర్పిన శస్త్రాలను కదపలేక
నిండుకొన్న ధాన్యంతో నిండని కడుపుతో క్షుద్బాధకోర్వలేక
విలపించిన ఆక్రందనల ఘోరకలిలో జనియించని ఆ కలికైనా తప్పదు ఆకలి
కాని, ఆ నరకుని తలనరికి తెచ్చే వీరుని కోసం పూజలు చేస్తోంది ప్రతి లోగిలి

Tuesday, August 23, 2011

కోరికలే తేనేటీగలా మనసనే పుష్పం మీద వాలగానే వయసే మాధ్యమంగా
అరిషడ్వర్గాలు నలుదిక్కులా వ్యాపించి భుతలాన్ని కలుషితం చేస్తున్నాయి

కోరికలు జనియించడం ప్రకృతి ప్రేరేపితం, వాటితో మనోసంపర్కం సహజసిద్ధం

కాలగమనంలో మనసేమో పరిపక్వం చెందకమానదు,
వయసేమో వృద్ధి చెందక ఆగదు

మరి, అరిషడ్వర్గాలను అణగదొక్కడానికి
ప్రకృతికి ఎదురీది అసహజంగా ఉండాలా
పరిపక్వం చెందరాదని మనసు బండరాయి కావాలా
ఆపలేని కాలగమనంలో వయసు పెరగరాదని మానవమనుగడే ఆగిపోవాలా
నిజంగానే అర్ధం కాదు ఏంటో ఈ విధాత చిద్విలాసం

Sunday, June 26, 2011

మకతిక

ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణం మానేయగలమా
ఊబకాయం వస్తుందేమో అని తినడం ఆపేయగలమా
అంతమేంటో తెలియదని ఆరంభించకుండా ఉండగలమా
మతిపోతుందేమో అని అందాన్ని ఆస్వాదించమా
ఆశ నెరవేరలేదని ప్రయత్నించడం నిలిపివేయగలమా
కలల సుందరి కానరాలేదని కళ్యాణఘడియని తప్పించగలమా
పిచ్చోడా!! అంతా తికమక మకతిక, ఎప్పుడు తెలుసుకొంటావ్!!!

Tuesday, April 12, 2011

ఇలా జరిగితే???

వెన్నెల రేయి చుక్కల అల్లికలో ఇంద్రధనుస్సు వసంతాల జల్లులు కురిపించాలి

మండు వేసవిలో ఎడారి ఇసుకతిన్నెల నడుమ గులాబీలు విరబూయాలి

మహాసాగరం అలల ఘోషలో సప్తస్వరాలు ధ్వనించేలా తిమింగలం నాట్యమాడాలి

చేకోరపక్షి రివ్వున ఎగరి సూరీడు చెంతచేరి గూళ్ళు కట్టాలి

అగ్నిపర్వతం బ్రద్దలయితే వసంతకాలంలా సుగంధాలు వెదజల్లాలి

మదిలో మెదలిన ఊహాసుందరి తలచిన వెంటనే టక్కున చెంతకు చేరాలి

గాలి భోంచేసేలా, అలలపై నడిచేలా, మేఘాలపై ఈదేలా సరిక్రొత్త శక్తి జనించాలి