Friday, February 12, 2010

కిన్నెర

సిలకల నవ్వుల్ది కిన్నెర, అరె! కొర కొర సూపుల్ది కిన్నెర, బిర బిర సెంతకు వచ్చేరా,
దాని సొగసుల్తో మనసంత గుచ్చేరా, కనుసైగల్తో ఊసుల దెలిపెరా, మావా! మనువాడ బాసల్ని జేసెరా

|| కోరస్ || ఒలె ఒలె ఒలే ! ఎవరా గుంట, ఏటి నీ కథ

అమ్మోరు జాతర్లో, గౌరమ్మ తల్లికి,
పొర్లు దండాలెట్టి, టెంకాయ కొట్టి, పరమాన్నమెట్టి ,
నా లగ్గమెప్పుడని, లంకె ఎలాగని, పిల్ల ఎక్కడని అడిగా

|| కో || ఆహా!

ఎంటనే దీవించే తల్లి

|| కో || ఎలగేలగా ?

గుళ్లోన మోగింది గంట, ఆ బుల్లేమో భలే బాగుందంట, నా గుండెఆగి పోయేనంట , మనసంతా పెట్టింది మంట

|| కో || ఆహా !

నే ఎల్లాను ఆ పిల్ల ఎంట, పేరేటి పిల్లా అంటే, కన్నెర్ర జేసింది పిల్ల,
కొట్టింది తలమీద జెల్ల,రుసరుసా ఎలిపోయే ఇల్లా

|| కో || తరువాత?

ఆ కొంటె కోణంగి ఎక్కడుంటదని, కొండంతా, కోనంతా, ఊరంతా, వాడంతా
అలుపే లేకుండా, బువ్వేమో తినకుండా, రేయిపగలంతా నే తిరిగా
అయినా కనరాదా పిల్లా, నాకు మతిపోయి మూర్చొచ్చే ఇల్లా

|| కో || అపుడు ఏటయింది?

ఘలు ఘల్లు మోగే కాలి గజ్జెల మోతలు,
గల గల జారే చేతి రబ్బరు గాజులు,
బిర బిర తాకే మృదువైన సేతులు,
జల జల రాలే కన్నీటి సుక్కలు

ఏటయిందని కనులార జూస్తే , ఎదురుగా ఉందా కూన

|| కో || ఆహా !

కిల కిల నవ్వింది, దగ్గరికి రమ్మంది, కలిసుందాం పదమంది, నాతోనే సయ్యంది ...

|| సిలకల ||

Sunday, February 7, 2010

సాంబశివా! శంభో సదాశివా! !

పల్లవి :
మనసంతా భక్తితో, శతకోటి మొక్కులతో, శివరాతిరి అందరు కలసి చిందేసి పాడుదాం..జై సాంబశివా! శంభో సదాశివా! !
శివనామ స్మరణంతో, తనువంతా పులకించి, ఈశ్వరుని పూజిస్తూ శివరాతిరి అంతా ఆడిపాడుదాం.. జై ఝటాధరా!గౌరీ మనోహరా !!

చరణం :
కరుణాసాగర, భక్తవశంకర, శశిధర శుభకర, భోళాశంకర.. ఈ పూజలందుకొనుమా, మాయందు దయజూపుమా
|| జై సాంబశివా! శంభో సదాశివా!! జై ఝటాధరా! గౌరీ మనోహరా!! ||
గంగాధరా హర, మార్కండేయ వర, నందీశ్వరా హర, అర్ధనారీశ్వర.. ఈ దీనుల మన్నించుమా, నీ దరిశనం కలిగించుమా || జై ||
నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురువువు, నీవే సఖుడవు.. మా ఆర్తి ఆలకించుమా, ఈ దాసుల ధరిజేర్చుమా || జై ||

పల్లవి : || మనసంతా ||

నాగాభరణా, గిరిజారమణా, త్రిశూలధరణా, లోకోద్ధరణా... భజనలు వినుమా, భక్తిని గనుమా || జై ||
డమరుకధారి, విశ్వంభరధారి, ప్రణవనాదఝరి, గజచర్మంభరధారి... చల్లగా చూడుమా, భక్తుల బ్రోవుమా || జై ||
హిమశైల నివసిత, మునిజన వందిత, సురాసుర సేవిత, భక్త జనాహిత... మార్గము జూపుమా, ముక్తినొసగుమా || జై ||

పల్లవి : || మనసంతా ||

|| జై || || జై || || జై ||