Sunday, September 16, 2012

వినువీధుల్లో

వినువీధుల్లో ఎదలోయల్లో దాగిన ఓ కుసుమం, మనసా వాచా నీతోనంటూ సాగెను ఈ పయనం
దడబిడ గడగడ అలజడి రేపెను ధ్యాసే అనునిత్యం, అలలా ఎగసే శ్వాస క్షణక్షణం నీ కోసం

వెండి మబ్బులో వసంతాలు చల్లనా, స్వాతి చినుకులా నీపై పులకరించనా
పైర గాలిలో హాయినవ్వనా, సుమగంధ మిళితమై నీ మోము తాకనా

కోనేటి అలలలా కదిలే కోటి కురులపై, జాజి కొమ్మలా నే  జంట కట్టనా
సంధ్య వెలుగుల రంగు పులుముకొని, కస్తూరి తిలకమై నీ నుదుట చేరనా

బొండు మల్లెలా బంగారు ఛాయతో, నీ సమ్మోహనాల మేని రంగు అవ్వనా
ఆరు అడుగుల నా తోడు నీడతో, ఆరుమూరల తళుకు చీర చుట్టనా

చిమ్మ చీకటి నిండు రాత్రిలో నీ కంటి కాంతుల వెండి వెలుగులద్దవా
అమ్మ మాటలా జోలాలి పాటలా నీ తీపి పలుకుల రాగామాలపించవా  


Saturday, July 14, 2012

బావో

ఆ అః అఆ ఆ అః అఆ అఅఆఆ అఅఆఆ...

గుంటూరు బావో చిత్తూరు బాయ్యో రంగా'రెడ్డి' బావో సికాకులం బాయ్యో!!!
అల్ స్టేటు బావలంత నాకోసం ఎగిరిపడతరు, గలీ గలీ టెంట్లే ఏసి లొల్లి జేస్తరు

చిత్తూరు పాలకోవా రంగు నాదిరో, కోనసీమ వంపుకన్న సొంపు గుంటరో,
గరం గరం చాయ్ కన్న యేడి గుంటరో, దమాగ్ గిట్ల ఖరాబ్ జేసే సోకు నాదిరో

తెలంగాణ సక్కినాలు, గోదారి పూతరేకులు, సీమోళ్ల సంగటిముద్ద ....
ఇలా కాకుటైలు ఫుల్ మీల్సు నాతో యవ్వారం,
కూచిపూడి, కోలాటం, తీన్ మారు, డిస్కోటెక్కు, కోయడాన్సు, డప్పు...
ఇలా మిక్సు చేసి రచ్చే రచ్చ నాతో తందానం

సిరిసిల్ల, ధర్మవరం, వెంకటగిరి, పోచంపల్లి, మంగళగిరి, గద్వాలు కోకలన్నిజల్ది నాకు తెచ్చి పెట్టావా
కొండపల్లి బొమ్మల్లె, కళంకారి అచ్చల్లె, నెక్లెస్సు రోడ్డల్లె నైజాము చమకులద్ది జర్ర నా పెయింటింగ్ ఎయ్యవా

పల్నాటి పౌరుషాలు కాకతీయుల ప్రతాపాలు కలిసున్న తెలుగు హల్కు ఎక్కడున్నడు? ఆడి కోర మీసం లాగడానికి ఎయిటింగ్ ఇక్కడ

మరి వాడు కానొస్తే.....

ఒంగోలు గిత్తల్లె ఫైటు జేస్తను, పొలికేకలన్ని పెదవితోని బందు జేస్తను, పల్సు రేటు పడే దాక బరువు దింపను....

Monday, July 9, 2012

కిన్నెర

సిలకల నవ్వుల్ది కిన్నెర అరె కొరకొర సూపుల్ది కిన్నెర
బిర బిర సెంతకు వచ్చెరా, దాని సొగసుల్తో మనసంత గుచ్చెరా
కనుసైగల్తో ఊసులదేలిపెరా, మావా మనువాడ బాసల్నిజేసెరా

కొరమీనులాంటి  బుల్లిరో, హంస దీని చెల్లిరో, జుంటి తేనె పలుకురో జుర్రెయినా
సురకత్తి లాంటి సూపురో, బొండుమల్లి రంగురో, పున్నమల్లె ఎలుగురో దీని జతలోన

కోనల్లో కేకేద్దామే చిన్ని, కొండల్లో కొలువుందామే అమ్మి
పరవాన్నం పాయసాలే రంగి, జాతరలో జేజ్జనకలే మంగి

మబ్బుల్లో మెరుపోచ్చనా మావా చేతుల్లో చేయ్యేసినా
వానల్లో వరదొచ్చినా పెళ్లి బాజాలే మోగించనా ఓ పిల్లా

తానల ఆటలో,  తందనాన పాటలో, తొలిజాము సిగ్గులో, మలిజాము మత్తులో,అడవితల్లి నీడలో, గంపెడంత పిల్లలో...

కాటికాపరి

నేనో కాటికాపరి  నామనసే ఒంటరి, జంగమదేవుడే రాసాడా నా విధి?
ఆలోచనల మంటలు దహిస్తున్నాయి నామది

నిరాశ నిస్పృహలే  వేస్తున్నాయి నాఆశల ప్రవాహఉధృతికి వారధి
ఈ వారధిని పెకలించే కోటివెలుగుల శక్తి విధాత రాసినా తెలియని దుస్థితి  

Friday, June 22, 2012

జాబిల్లి

జాగు చేయకే జాబిల్లి,మబ్బుల్లో దోబూచులాటలన్నీ వదిలి..
వరాల వెండి నవ్వుల్ని మాపై చల్లి
హాయి దొంతరలు మాపై అల్లి
కలల నావకు లంగరు వదిలి
చేరుకోవాలి నిదుర లోగిలి

Tuesday, March 20, 2012

సాఫ్టువేరు జీవితం

ఎవ్వరు చూసినా పెంచుతారు రేటు, అంతా కుదుపులే ఐటి రూటు,
ఈ సాఫ్టువేరు ఫీల్డ్అంటే నాకేమో చెడ్డ చిరాకే
ఆ ఫార్మల్స్ ఫుల్ స్లీవు షర్ట్టుల్ల్తో పెద్ద హేడ్డేకే
మన బాడిలో హార్డువేరు పార్ట్లంతా హుష్ పటాకే

అదిరేటి లైఫ్ స్టైలు అంట , అందరూ కేకన్నారంట , అలవాటు పడిపోయామంట,
హైకులు లేక వచ్చింది తంటా, కాస్ట్లేమో రాకెట్లా ఫాస్ట్అంట,
మెయిన్టెయిన్ చెయ్యనీకి వాచి పోతుందేట్టా ||ఎవ్వరు||

ఎల్ కే జి ఫీజులంట దేవుడా ఎం బి ఏ ఫీజులకి బాబు రా,
ఏమి జీతాలు దేవుడా పదికంతా ఆవిరై పోయెరా,
రెంట్లేమో ఆకాశం దగ్గర అకౌంట్లో బాలన్సు నిల్లురా,
క్రెడిట్ కార్డు బిల్లు నాయనో పల్సేమో పడిపోయే నో న నో ||ఎవ్వరు||

ఫేసుబుక్కు ట్విట్టరు ఒద్దురో ఓరన్నా, స్టేటస్లు బిరియాని పెట్టవు మాయన్న,
ఫ్రీ టైము కుప్పలు తెప్పలు ఓరన్నా, సైడుగా బిజినెస్సు షురూజెయ్ మాయన్న,
పైసల్ జర్రంత ఎనకెయ్యి ఓరన్నా, లేకుంటే చిరిగి చాటవుద్ధి మాయన్న

ఛీ నీ 'బీప్' సాఫ్టువేరు జీతం జీవితం...

Thursday, February 16, 2012

సమయం కాదిది

సమయం కాదిది హద్దే ఉన్నది, రెండొకటన్నది విరహం తీరిది
కురుల మబ్బులో అంతా కొత్తగున్నది, రేయి పవలు అసలే తెలియకున్నది

వాలుకళ్ళ కైపులో ఎగసేలే ఎండమావి కెరటం
చిరుతపులి వేటలో మృగములా మారెనే కృష్ణజింక వేగం

అదిరే అధరం కురిపించే మధురం, నరనరం పలికెను సప్తస్వరం
కౌగిలి వలలో జిగి బిగి యుద్ధం, తలపించెను సాగరమథనం

సమరమే సాగని ఓటమి చాలని ఓపిక లేదని తీరికే వద్దని
మత్తులో మునిగినా గమ్మత్తులే కలగని

Tuesday, January 17, 2012

నీవని

మనసుని మాటని కలిపితే ప్రేమని ఈ రెండక్షరాల తీపి నీవనీ ,
ఊహలో ఊసుని గుండెలో ఆశని ఈ గాలిలోని హాయిలా తాకితే చాలనీ ,
ఎంతగా చెప్పను ఏమని తెలుపను ఆ స్వర్గానికి నిచ్చెన నీ నవ్వనీ ,
నీడలా తోడులా ఎన్నడూ వీడని నా శ్వాసలో సంతకం చేసి తెలుపనీ ,

మాటలే గలగలా ఎండలో వెన్నెల అమావాస ఆకసంలో రంగేలిలా,
ముత్యము తెలుపుని కెంపులో కాంతిని కలిపిచేసినట్టుందే నీ మేని రంగుని,
మబ్బుల్లో దాగిచూడనీ నీ నడకహోయలుని ,వాగులేమో చిన్నబోవా చూసి నీ నడుమువంపుని

చూపులే చాలులే చింతలే లేవులే వింత వింత ఆశలన్నీ కలిగాయిలే
నీతోడు ఓ కోవెల ఆ దేవుడే కాపలా, చాలు చాలు పిచ్చి గోల ఎందుకో ఇలా..

Monday, January 9, 2012

భవిష్య ఉద్భోధ

మనసుకి అంతరాత్మకి శిరోక్షేత్రంలో జరిగే ఈ భీకరమైన పోరులో
అస్త్ర శస్త్రాలు లేవు అక్షోహిని సైన్యాలు లేవు జయ అపజేయాలు లేవు
కాని ఈ యుద్ధాన్ని నడిపించే సౌందర్య ఆరాధన అనే ఆలోచన
ఎంతవరకు సమంజసం అనే భవిష్య ఉద్భోధ ఏ కృష్ణుడు చేస్తాడు