Wednesday, November 25, 2009

పరేషాన్

చలాకీ చిన్నది, జాబిలిలా నవ్వింది, తీగలా మెరిసింది, జాతరలో కలిసింది,

గిలకలా ఘల్లంది, లొల్లి లొల్లి చేసింది, దగ్గరికి రమ్మంది, గిల్లి గిచ్చి పెట్టింది, మౌనమేల పదమంది,

మనసేమో పొమ్మంది, మాట మాత్రం విననంది, అయ్యబాబోయ్ సిగ్గంది, ఆహా! బుర్రంతా పాడయింది,

… దిల్లంతా పరేషాన్ చేసింది రా మావా!!! ….

Monday, November 23, 2009

ఎంత

నాలోఉన్న నీతో ఏకమైన మనసుని అడుగు నువ్వంటే ఎంత ఇష్టమని,

క్షణమైనా నీ రూపు మరువలేని కనుపాపని అడుగు నిను విడచి ఉండటం ఎంత కష్టమని,

ఎప్పుడూ నిన్నే తలచే నా ఆలోచనని అడుగు నీకోసం ఎంత పరితపిస్తానని,

నీ ధ్యాసే ప్రేరణగా కదిలే గుండెచప్పుడుని అడుగు నీ చెలిమికై ఎంత తల్లడిల్లానని,

నీ కోసమే జీవిస్తూ వదిలే ప్రతి శ్వాసని అడుగు నీ రాకకై ఎంత ఎదురు చూస్తానని...

Tuesday, September 8, 2009

ఆనాడు - ఈనాడు

నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అన్నారు ఆనాడు,
కానీ తప్పించుకు తిరిగే వాడిని జిత్తులమారి నక్క అంటారు ఈనాడు||
నలుగురిలో నారాయణ అంటే గొప్ప అన్నారు ఆనాడు,
జనులు మెచ్చేలా ఏంటి నీలో గొప్ప అంటారు ఈనాడు||
దాన వీర శూర కర్ణుడిలా త్యాగశీలి అవ్వాలి అన్నారు ఆనాడు,
ధనబలం, దానగుణం సమపాళ్ళలో ఉంటేనే మనగలం ఈనాడు||
చేయాలి పదుగురికి మంచి, మనలోని ప్రేమని పంచి,
పోరాదు చెడుని సహించి, నిలబడాలి ముందుండి ఎదిరించి||
చెడుచేయాలని ఎవరైనా తలిస్తే కొట్టాలి దెబ్బ, న్యూటన్ మూడవ సూత్రం కలలో కూడా జ్ఞప్తికి రాకూడదు అబ్బా||

Thursday, August 27, 2009

యవ్వనం

కలసిన చూపులు తెరదించెను మౌనం, ఉరకలు వేసే యవ్వనం కోరికల గుర్రాల స్వారీకి ప్రారంభించెను అశ్వమేధం,
అధరంతో అధరం, మధురాతి మధురం, ఒళ్ళంతా పులకించి పలికించేను నరనరం సప్తస్వరం,
స్పర్శ కలిగించేను విద్యుత్ ప్రవాహం, మొదలాయను కౌగిలి బిగిలో జిగి బిగి యుద్ధం, ఆహా! ఇది మరో సాగర మధనం,
కాస్తంత బిడియం, కానీ తాళలేను తనువు తాపం, చల్లని సమీరంలో ఆ సమరం తలపించును భూతలస్వర్గం

Tuesday, August 18, 2009

కావాలి స్వేచ్ఛ

మాతృభాషలోని మాధుర్యాన్ని మరచి, పరాయి భాషలో గొప్పదనాన్ని వెదికే సంస్కృతి నుంచి కావాలి స్వేచ్ఛ ,
క్రీడాస్ఫూర్తి నింపడానికి విదేశీయుల తర్ఫీదుకే ప్రాముఖ్యాన్నిచ్చే పద్దతినుంచి కావాలి స్వేచ్ఛ,
భారతదేశపు ఆర్ధికస్థితి కొన్ని విదేశాల మనుగడపైనే ఆధారపడే స్థితి నుంచి కావాలి స్వేచ్ఛ,
హాలీవుడ్ ని చూసి బాలీవుడ్, టాలీవుడ్ అని పేర్లు పెట్టుకొనే మూస ధోరణి నుంచి కావాలి స్వేచ్ఛ,
చలన చిత్రాలను, రాజకీయాలను, కులమతాలను ఒకేగాడిన కట్టే ఆలోచన నుంచి కావాలి స్వేచ్ఛ,
ఆకలికేకల విలయతాండవం ఒకవైపు, అపరాకుబేరుల విలాసాలు మరోవైపు, ఈ అసమతౌల్యము నుంచి కావాలి స్వేచ్ఛ,
స్వదేశాభివృద్దికి కృషిచేయక, విదేశం భూతలస్వర్గం అనుకొంటూ ఆత్మనింద చేసుకోవడం నుంచి కావాలి స్వేచ్ఛ,
ధనార్జన మత్తులో, కుటుంబానికి సమయం వెచ్చించలేక సాగే ఉరుకుల పరుగుల జీవితం నుంచి కావాలి స్వేచ్ఛ...

Monday, August 17, 2009

నవ భారతం

బానిస సంకెళ్ళు తెంచి స్వేఛ్ఛా వాయువుల్ని ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్యసమరయోధులు, అందరికీ వందనాలు

దేశంలోనైనా మనుగడ సాగించగలం, ఎవరితోనైనా సర్దుకుపోగలం , భిన్న వేషభాషలు అలవరచుకోగలం,కానీ మూస ధోరణికి భిన్నంగా మనమంటే ప్రత్యేక ముద్రవేసే సృజనాత్మకత కావాలి

టాటాల మొదలు, బిర్లా, మిట్టల్, అంబానీల వరకు ప్రపంచ ఆర్ధికస్థితినే శాసించగలిగే మేధావులు ఉన్నారు, కానీ నాణేనికి మరోవైపులా ఇంకా ఉన్న ఆకలి చావులను, ప్రాధమిక వైద్యం లేని ప్రదేశాలను రూపుమాపే మరో వందమంది మేధావులు రావాలి

మత్తగజము కంటే స్థిరమైన ఆర్ధిక స్థితిగల్గిన పలుప్రపంచదేశాలు ఆర్థికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నా, భారత ఆర్ధిక స్థితిని సరైన మార్గంలో నడిపించే చాణక్యులు ఉన్నారు, కానీ ప్రపంచ ఆర్ధికస్థితి నీలినీడలు భారతావనిని ప్రభావితం చేసే పరిస్థితిని దూరంచేసే నవచాణక్యులు పుట్టాలి

దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు గురజాడ అప్పారావుగారు, సూత్రాన్ని తూ|||| తప్పకుండా పాటించి భారతీయ ఖ్యాతిని నలుదిక్కులా వ్యాపింపచేసిన భారతీయులకు ఘనత సొంతం,

కానీ నవతరంలో ఉరకలు వేసే యువతరం భారతీయ కీర్తిని ప్రపంచ దేశాలంతా దిక్కులు పిక్కటిల్లేలా కొనియాడే విధంగా కృషిచేయాలని కోరుకొంటున్నాడీ సగటు భారతీయుడు….

Tuesday, August 11, 2009

జీవితాంతం

బోసినవ్వుల పాలబుగ్గల పసి పాపాయిని చూసి, ఇలాగే గడవాలి అనిపిస్తుంది జీవితాంతం

పున్నమి వెలుగుల జల్లులలో, కొసరి కొసరి గోరుముద్దలు పెట్టే అమ్మ ఒడిలో ఒదిగిపోవాలనిపిస్తుంది జీవితాంతం

బుడి బుడి నడకలతో తప్పటడుగులు వేస్తే, సరిదిద్దే నాన్న సంరక్షణ ఉండాలి జీవితాంతం

ఓనమాలు నేర్చుకొని చిట్టి పొట్టి మాటలు పలికితే సంబరపడే అమ్మానాన్నల ఆనందం కావాలి జీవితాంతం

విద్యాబుద్దులు నేర్పించి, క్రమశిక్షణ అలవరచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అధ్యాపకుల ఆశీస్సులు తోడుండాలి జీవితాంతం

గెలుపు ఓటములలో వెన్నుతట్టి నిలిచి, మంచి చెడుల విచక్షణ తెలియజెప్పే మనసైన సహచరులు ఉండాలి జీవితాంతం

కొంటె కోణంగిలతో, చిలిపి చేష్టల్లో, సరదాగా సాగే ఉరకలు వేసే యవ్వనం ఉండే నూనూగుమీసాల వయస్సవ్వాలి జీవితాంతం

పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, పదుగురికి సాయపడుతూ, ఇంతింతై వటుడింతై ప్రపంచఖ్యాతి గడించే తపన ఉండాలి జీవితాంతం

నెమలిలోని హొయలు, కోయిలలోని మాధుర్యం, హంసలోని గుణం, జలకన్యలోని చురుకు కలగలిసిన మగువ తోడుకావాలి జీవితాంతం

మనసిచ్చిన మగువతో రసరమ్యభరితమైన రతిరాసక్రీడల్లో స్వర్గాన్ని తలపించే యవ్వనం సొంతమవ్వాలి జీవితాంతం

ఈ అంతంలేని జీవిత చక్రం ఏ కధకైనా ఓ మంచి సుఖాంతం .......

Friday, July 10, 2009

ఎందుకు లేదు?

చీమలు దూరని చిట్టడవుంది, కాకులు దూరని కారడవుంది... కాని ప్రేమ దూరని మనసెందుకు లేదు?

మాటలు చెప్పే చిలకుంది, పాటలు పాడే కోయిలుంది… కాని మనసును తెలిపే ధైర్యం ఎందుకు లేదు?

సూర్యుడు తాకని చోటుంది, ఉరుములు లేని పిడుగుంది… కాని చలించని గుండె ఎందుకు లేదు?

కోర్కెలు లేని ప్రాణి ఉంది, వరాలివ్వని దేవత ఉంది… కాని స్వార్ధం లేని ప్రేమ ఎందుకు లేదు?

వరదలు రాని వాగే ఉంది, జల్లులు పడని స్థలమే ఉంది… కాని కన్నీళ్లు తెప్పించని ప్రేమ ఎందుకు లేదు?

Tuesday, July 7, 2009

ఏంటో ఇదంతా

తొలిచూపులో నచ్చావనగానే గూబగుయ్ మనిపించావు,
చుట్టూ తిరిగి మన్నించమని వేడుకొంటే చెంపచెళ్ళుమనిపించావు,
కవ్వించాలని పిచ్చి చేష్టలు చేస్తే కుక్కల బండి ఎక్కించావు,
తళుక్కుమనే అందాలను తనివితీరా పొగిడితే తాగుబోతునని తీర్మానించావు,
ప్రేమంతా ఒక మాయ అనే వైరాగ్యంలో తాపసిలా మారగానే చెంతచేరి జీవితాంతం నీతోనే అన్నావు,
ఏంటో ఇదంతా, పరస్త్రీ వ్యామోహం లేదనే ప్రయోగాత్మక నిర్వచనం కాబోలు......

Wednesday, July 1, 2009

room mates

శ్యామ సుందరుడైన కృష్ణభగవానుని కరుణాకటాక్ష వీక్షణ కిరణాలతో మహీతలమంతా మమతానురాగాల హరివిల్లుల అల్లికలో ఆనందభరితమై సుఖసంతోషాలు రాజ్యమేలే అద్భుతలోకం అవ్వాలి...

Monday, June 15, 2009

ఒక్కటే

భగవంతుని పలువిధాలుగా కొలిచినా అంతరాత్మలో జనించే భక్తి భావం ఒక్కటే,
మతాలు ఎన్నైనా భోదించే మానవత్వమనే తత్త్వం ఒక్కటే,
పిల్లలు ఎందరున్నా అమ్మ చూపించే లాలన ఒక్కటే,
అనుభందభాంధవ్యాలు ఎన్నున్నా కడదాకాసాగే స్నేహబంధం ఒక్కటే,
పాటలెన్నున్నా స్వరాలను జనింపజేసే సప్తస్వర సమ్మేళనం ఒక్కటే,
సృష్టికే ప్రతిసృష్టి చేసేలా అందరినీ నడిపించే సృజనాత్మకత ఒక్కటే,
అందమైన శిల్పాలెన్నున్నా రూపమిచ్చే ఉలి ఒక్కటే,
కోపతాపాలెన్నునా క్షణంలో కరిగించే ప్రేయసి ముద్దు ఒక్కటే,
తారలెన్నున్నా మానవజాతికే వన్నెతెచ్చిన ధృవతార ఒక్కటే,
ఎందరు పోటిచేసినా అందరిలో గెలవాలన్న కృతనిశ్చయం ఒక్కటే,
భాషలెన్నున్నా తేనేలోలికించే తేట తెలుగు ఒక్కటే.

Friday, June 5, 2009

చకోరపక్షి

చక్కని చుక్కైన నీ చెక్కిలి తాకాలని,
చక చకా నీ చెంత చేరాలని,
చల్లని సాయంత్రం చందమామ రావాలని,
చెలికాడినై జిలిబిలి పలుకులు చిత్తగించాలని,
చిరు జల్లుల్లో చలాకీగా కలసి చిందేయ్యాలని,
చలోక్తులతో చక్కగా చమత్కరించాలని,
చిలిపి చేష్టలతో చక్కిలిగింతలు పెట్టాలని,
చారడేసి కళ్ళను చటుక్కున చుంబించాలని…
ఓ చెలీ!! చకోరపక్షిలా నీ చుట్టూ తిరుగుతున్నాను.

Wednesday, May 20, 2009

ధనమూలం ఇదం జగత్

తప్పవా ఉరుకులు, అలుపెరుగని పరుగులు,పరదేశం చేరడానికి, బానిసలా బ్రతకడానికి,
కానీ డబ్బుకోసం తప్పదిలా సిగ్గువిడచి ఉండాలి కుక్కల వలె, నక్కల వలె,
ఎన్నాళ్ళిలా మానం విడచి, అభిమానం వదలి, అయినా తప్పదు ధనమూలం ఇదం జగత్,
అంటా అగమ్యగోచరం , పైసా కోసం విలువలనే పాతరేసిన వైనం
ఒక్కటి నిజం, ధనం కోసం కుంజరయోధమైనా దోమ గ్రొత్తుకజొచ్చెన్ !!!!

Monday, May 18, 2009

ఆలోచన

గతించిన కాలం మారిపోదు, పాతస్మృతులను చేరపలేదు,
రాబోయే జీవితమలుపు ఎలాంటిదో భవిష్యత్తులో కాని తెలియదు
జరిగిన విషయాన్ని తలుచుకొంటూ, జరగబోయేదాని గురించి మధనపడుతూ, వర్ధమానాన్ని ఓ పీడకలలా గడపకు !!
గతస్మృతులు ఓ పీడకలలా గతానికే వదిలేసి,
వర్ధమానంలో ఆలోచనలు భవిష్యత్తులో జీవితమలుపును తీపిజ్ఞాపకం అయ్యేలా చూసుకో........

ఓ ప్రేమా !!

ఓ ప్రేమా !! ఏమిటి నీ కులం ఏది నీ మతం

రాళ్ళనైనా కరిగించగలవు ఎలాటింది నీ గతం

ఇప్పటికీ అర్ధం కాలేదు ఏమిటో నీ అభిమతం

నీ గురించి ఎలా వ్యక్తపరచను నా మనోగతం

పలువిధాల భావసమ్మేలనం నీతో నా సహజీవితం

Thursday, February 19, 2009

జాక్ పాటు

తనకోసం ఎప్పుడూ తడబాటు,
ఏమిటీ నేను చేసిన పొరబాటు,
కాలగమనంలో తప్పదు ఎడబాటు,
ఆ విరహంలో ఎప్పుడూ ఏమరపాటు,
మనకు వద్దు ఈ ప్రేమనే గ్రహపాటు,
మాటవినని మనస్సుతో ఏమిటీ అగచాటు,
తను కాదంటే గుండెల్లో పిడుగుపాటు,
తను అవునంటే కొట్టినట్టే జాక్ పాటు.

తను

తనకోసం తలచి తలచి తానే లోకమనే తలంపులో,
తనతో మమేకమవ్వాలనే తపనతో,
తానే పంచభూతాలుగా తపించే తన్మయత్వంలో ఉన్న ఓ నేస్తం!!

ఆ తరుణి కోసం తాపసివై, తలంచిన నీ తపస్సుకు,
తారకలే తోడువచ్చి , త్రికోలైనా తరచి తరచి , తనను నీ ముంగిట నిలపాలి.

గమ్యం

ఏమిటోయి నీ గమ్యం,
ఎందుకోయి ఈ పయనం,
ఎచటికోయి నీ గమనం,
కలలతీరం అతి మధురం,
కాని వాస్తవానికి బహుదూరం,
లే! నిదురలే! ఉరకలేసే ఉత్సాహం, పరుగులెత్తే చైతన్యం నీ సొంతం,
పో! సాగిపో! వడివడిగా, త్వర త్వరగా,
చేరాలి నీ గమ్యం, తాకాలి కలలతీరం.

నువ్వు

నీ రూపే అపురూపం,
నీ కనుసైగే కరవాలం,
నీ పలుకే వేదమంత్రం,
నీ స్పర్శే భావజనితం,
నీ నడకే నెమలి నాట్యం,
నీ తలపే అతిమధురం,
నీ ధ్యాసే నిత్యకృత్యం,
నీ చెలిమే మనోబలం,
నీ ఊహల్లో గగనవిహారం ....... కాని నువ్వులేని క్షణాన కాలమంతా కల్లోలం, కదలేదు ఈ కలం.

సప్తరుచి

తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు షడ్రుచులలో భాగం,
కానీ ఫై రుచులన్నీ కలబోసి నువ్వుచ్చిన ముద్దు జీవితకాలం మరువరాని,
కేవలం నాకు మాత్రమే సొంతమైన సప్తరుచి చెలియా......

ప్రియతమా

కలకాలం చెరిగిపోనిది మన స్నేహబంధం,
నీ మాటల్లోని మాధుర్యం అమృతతుల్యం,
నీ ఆదరణ ఆప్యాయత ప్రేమాన్వితం,
లోకాన్నే సరికొత్తగా చూపి నవనూతానోత్సాహాన్ని నింపిన నీ ప్రేరణ అమోఘం,
పరిచయకర్తయిన ఆ దేవదేవునికి ఎలా విన్నవించను నా కృతజ్ఞతలు ??
ఈ చిరుకాల పరిచయం చిరకాలం చిరస్మరణీయం ప్రియతమా..,,,

కోమలితో

నిత్యనూతనం, తేజోమయ కాంతిపుంజం అయిన విశ్వమే శూన్యంగా,
పంచభూతాలు సైతం అక్కరకు రాని చుట్టంగా భావించి,
నిరాసక్తతతో నిర్జీవమై నిద్రాణ స్థితిలో ఉన్న
నీ జీవన రేఖను భాగ్యరేఖగా మార్చడానికి తళుక్కున తారకలా విరిసిన ఆ కోమలితో
ప్రేమవారధి కలపడానికి ఆ కోదండరాముడు సైతం ఉడతాభక్తి సాయం చేస్తాడు నేస్తం.

తన్మయమోక్షం

తనుకులీనే మేని ముఖవచ్చస్సు, నవయవ్వనపు పొంగులు, జగదేక ముగ్దమనోహర రూపం మేళవించిన
ఆ లావణ్యవతి సొబగులు సాగర జలక్రీడల్లో గాంచి సాగరకన్యలు సైతం చిన్నబోగా,
ఆ హరి సైతం నాటి గజేంద్రమోక్షంలా నేడు తన్మయమోక్షం పునరావృతం చేయనున్నాడా అనే తలంపు అతిశయోక్తి కాదేమో !!!

భాషాన్వేషణలో

తెలుగులో అన్నాను నినువిడచి ఉండలేనని,
హిందీలో చెప్పాను తేరేబినా నహీ జీనా,
ఆంగ్లంలో అన్నాను ఐ మిస్ యు,
ఇలా పలుబాషల్లోచెప్పినా నిను చేరలేదేమో నా ప్రేమ భావన?
కాని నీలో ఏకం కావాలనే మనోభావనకు భాష్యం చెప్పే భాషాన్వేషణలో..............

Wednesday, February 18, 2009

ఎడబాటు

అత్యంత శక్తిమంతమైన వజ్రాయుధాన్ని తలపించే పిడుగుపాటు యొక్క విద్యుదాఘాతతాకిడిని తట్టుకొనగల
ఇన్సులేటర్ ను కనుగొన్న మహామేధావి !
శతసహస్రకోటి పిడుగుపాట్లకు సమానమైన ఎడబాటుతాకిడిని తాళలేని మనసు నీ సహాయాన్ని అర్ధిస్తోంది.

రారాజు

ఊహలపల్లకిలో విహరిస్తున్న నీ ఆశలసౌధం సాకారానికి,
అంతర్లీనంగాఉన్న నీ సృజనాత్మకతను కాలానుగుణంగా అన్వయించి, రారాజుగా వెలుగొందిన క్షణాన,
నీ కీర్తి దిగాదిగంతాలకు వ్యాపించి పదుగురు వేనోళ్ళపొగడగా వినాలనిఉంది మిత్రమా!!!

తెలుగుపలుకులతో

తెలుగుపలుకులతో తెనేలోలికించే చిన్నదానా
ఏం మాయ చేసావోగాని నీ మాటలగమ్మత్తులో మైమరచిపోతాను...

సాఫ్ట్ వేర్ కీకారణ్యం

మోనిటర్ కాంతులే సూర్యకాంతిలా,
కీబోర్డు శబ్దాలే పక్షుల కిలకిలారావాలుగా,
మేనేజర్ అరుపులే పులి గాడ్రింపులుగా,
క్లైంట్ కేకలే సింహగర్జనలుగా,
పనిచెయ్యని టీంమేట్స్ తోడేళ్ళ సహవాసంగా,
ఆన్సైట్ ప్రశ్నలే వేటగాడి బాణాల్లా,
అరవిరిసిన అందాలే లేడిపిల్లలుగా,
సిస్టం బగ్సే విషనాగులుగా,
ప్రోడక్ట్ డెలివరీలే పెనుతుఫానులుగా,
మాటవినని మనసే వానరంలా ఉండే సాఫ్ట్ వేర్ కీకారణ్యంలో పయనించే బాటసారి ఆచితూచి అడుగెయ్యి!!!

ఓ అంతర్యామీ గనలేవా ???

అనంత విశ్వమంతా వ్యాపించి అజరామరమైన నీ ప్రేమ ప్రవాహఉద్రుతిని తాళలేక విలపించిన హృదయం ,
మరుజన్మకైనావిశ్వాన్నే దాచుకొనే అగాధం కోసం ఆక్రోశిస్తున్నాడీ అలుపెరగని బాటసారి....
అంతర్యామీ గనలేవా ???

క్షణాన

జాలువారే నీ కురులను మలయమారుతం తాకిన క్షణాన,
నీ చెక్కిలి నొక్కులపై విరిసిన చిరునవ్వునికాన,
ఆగని కాలమైనా క్షణమాగి మైమరచిపోక తప్పదుసుమా

Monday, February 16, 2009

బుల్లికవి

కల్మషమే కానరాని, దాపరికంలేని పుత్తడి బొమ్మకోసం దేవుడే దిగివస్తాడు అన్నాడో మహాకవి,
కాదు దేవేరి కనుసైగకై వేచి ఉన్నాడు అంటున్నాడీ బుల్లికవి ....

సాగిపో


కుశాగ్ర బుద్ధివయ్ , దృఢ చిత్తముతో , లక్ష్యమే ఊపిరిగా, ఆకాశమే హద్దుగా, సాగిపో ఓ నేస్తం,

అపుడు కానరాని, గనలేని, ధరికిరాని, చేరుకొని, చేరలేని విషయం ఈ జగత్తులో ఏది లేదు.

ఓ జవ్వనీ , ధరికి రావేమి ??

నీ కాలి అందెల మువ్వల సవ్వడితో,
వయ్యారాల నడుము ఒంపులో జడగంటలు ఆదితాళం వేస్తుంటే,
నీ కురులు వీణావినోదం చేస్తుంటే,
నీ అధరామృతాన్ని గ్రోల వేణుగానమై శ్రుతి కలపాలని ఉవ్విళ్లూరుతున్నాను ఓ జవ్వనీ , ధరికి రావేమి ??

నేస్తం

ప్రియ నేస్తం ఈ ఉషోదయం నీకు అవ్వాలి నవనూతనోదయం,
సిరులోలికించే నీ నగుమోముకు చిరునవ్వే చిరునామా,
ఈ విశాల వినువీధిలో నా ఈ నేస్తం తారాజువ్వలా వెలగాలని కోరుకొంటూ ....