Tuesday, October 19, 2010

కమ్మని కల

అలకల కులుకుల చిలకల పలుకుల గలగల మువ్వల అందెల చిందుల సొగసుల సుందరి నవ్వగా
మాటే తడబడి మనసే ముడిపడి బాగా మతిచెడి కలలో కనపడి తనువంతా జొరబడి కవ్వించగా
కొంటె కోరికలు జంట కట్టమని ఘడియ ఘడియకి తుంటరి మనసుని వెంబడించి మరీ వేధించగా
... టక్కున మ్రోగెను గంట, ఉలిక్కిపడి లేచానంట, ఆహా !! కమ్మని కల భలే బాగుందంట...

Tuesday, August 3, 2010

నిధి

బోసినవ్వుల మైమరపులో యుగమే ఒక క్షణమంట,
చల్లనైన చూపులతో పగలే జాబిలమ్మ వెన్నెలంట,
తళుక్కుమనే మోముగని తారలే చిన్నబోయేనంట,
లేత చిగురుటాకు తాకగానే పాలబుగ్గలేమో కందిపోయెనంట,
కేరింత విని కోయిలమ్మ తోడుగా గొంతు కలిపెనంట,
కాలి అందెల మువ్వల సవ్వడి మదిలో మోగించెను జేగంట,
వేయినోముల పుణ్యఫలం మా 'పెన్''నిధి' సన్నిధిలో కలకాలం సాగిపోవాలంట......

Wednesday, March 24, 2010

మౌనమా

మౌనమా మధుర కావ్యమా, మనసులో తీయటి గానమా, రేపకే తహతహ తాపమా, తగిలేనే నులివెచ్చని మైకమా,
తనువులో ఆగని విరహమా, ఏమిటో తెలియని భావమా, వయసుతో తరగని భంధమా, ఎప్పుడూ ఆగని పరువమా,
మోగేలే యెదలో రింఘిం మధురిమా...

సల సల మరిగెను, భగ భగ మండెను ఈ విరహ తాపం,
వరదై పొంగెను, పిడుగై రాలెను ఈ గుండె సైతం,
రివ్వున వీచెను, సుడిగాలై కదిలెను ఈ శ్వాస వేగం,
మాటే రాక, ఎడబాటే తెలియక ఆణువణువూ పాడెను సామగానం

బిడియం తగదు, బెరుకే లేదు, రేతిరి తరగదు, పగలే రాదు, భంధం ఆగదు,
బాధే తెలియదు,కాలం తరగదు, కునుకే రాదు, కోరిక తీరదు

ఓ డియర్ ! హ హా హ హా !! కం నియర్ , డియర్ ! హా హా !! కం నియర్
|| మౌనమా ||

వేటే ఆడెను, స్వారీ చేసెను ఈ రతీ వినోదం,
తేనెలు ఊరెను, అధరం చిలికెను ఈ సరసావేశం,
మాయే చేసెను, మతి పోగొట్టెను ఈ భామా కలాపం,
పట్టే వదలక, మనసే బెదరక నరనరం చేసెను వీణావినోదం ,

కలయే రాదు, కలతే లేదు, వేదన ఆగదు, ముచ్చట తీరదు,కూర్చోనివ్వదు,
పడుకోనివ్వదు,గిలిగింతలు ఆగదు, గడువే చాలదు, గొడవే తీరదు

|| ఓ డియర్ ||

Friday, February 12, 2010

కిన్నెర

సిలకల నవ్వుల్ది కిన్నెర, అరె! కొర కొర సూపుల్ది కిన్నెర, బిర బిర సెంతకు వచ్చేరా,
దాని సొగసుల్తో మనసంత గుచ్చేరా, కనుసైగల్తో ఊసుల దెలిపెరా, మావా! మనువాడ బాసల్ని జేసెరా

|| కోరస్ || ఒలె ఒలె ఒలే ! ఎవరా గుంట, ఏటి నీ కథ

అమ్మోరు జాతర్లో, గౌరమ్మ తల్లికి,
పొర్లు దండాలెట్టి, టెంకాయ కొట్టి, పరమాన్నమెట్టి ,
నా లగ్గమెప్పుడని, లంకె ఎలాగని, పిల్ల ఎక్కడని అడిగా

|| కో || ఆహా!

ఎంటనే దీవించే తల్లి

|| కో || ఎలగేలగా ?

గుళ్లోన మోగింది గంట, ఆ బుల్లేమో భలే బాగుందంట, నా గుండెఆగి పోయేనంట , మనసంతా పెట్టింది మంట

|| కో || ఆహా !

నే ఎల్లాను ఆ పిల్ల ఎంట, పేరేటి పిల్లా అంటే, కన్నెర్ర జేసింది పిల్ల,
కొట్టింది తలమీద జెల్ల,రుసరుసా ఎలిపోయే ఇల్లా

|| కో || తరువాత?

ఆ కొంటె కోణంగి ఎక్కడుంటదని, కొండంతా, కోనంతా, ఊరంతా, వాడంతా
అలుపే లేకుండా, బువ్వేమో తినకుండా, రేయిపగలంతా నే తిరిగా
అయినా కనరాదా పిల్లా, నాకు మతిపోయి మూర్చొచ్చే ఇల్లా

|| కో || అపుడు ఏటయింది?

ఘలు ఘల్లు మోగే కాలి గజ్జెల మోతలు,
గల గల జారే చేతి రబ్బరు గాజులు,
బిర బిర తాకే మృదువైన సేతులు,
జల జల రాలే కన్నీటి సుక్కలు

ఏటయిందని కనులార జూస్తే , ఎదురుగా ఉందా కూన

|| కో || ఆహా !

కిల కిల నవ్వింది, దగ్గరికి రమ్మంది, కలిసుందాం పదమంది, నాతోనే సయ్యంది ...

|| సిలకల ||

Sunday, February 7, 2010

సాంబశివా! శంభో సదాశివా! !

పల్లవి :
మనసంతా భక్తితో, శతకోటి మొక్కులతో, శివరాతిరి అందరు కలసి చిందేసి పాడుదాం..జై సాంబశివా! శంభో సదాశివా! !
శివనామ స్మరణంతో, తనువంతా పులకించి, ఈశ్వరుని పూజిస్తూ శివరాతిరి అంతా ఆడిపాడుదాం.. జై ఝటాధరా!గౌరీ మనోహరా !!

చరణం :
కరుణాసాగర, భక్తవశంకర, శశిధర శుభకర, భోళాశంకర.. ఈ పూజలందుకొనుమా, మాయందు దయజూపుమా
|| జై సాంబశివా! శంభో సదాశివా!! జై ఝటాధరా! గౌరీ మనోహరా!! ||
గంగాధరా హర, మార్కండేయ వర, నందీశ్వరా హర, అర్ధనారీశ్వర.. ఈ దీనుల మన్నించుమా, నీ దరిశనం కలిగించుమా || జై ||
నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురువువు, నీవే సఖుడవు.. మా ఆర్తి ఆలకించుమా, ఈ దాసుల ధరిజేర్చుమా || జై ||

పల్లవి : || మనసంతా ||

నాగాభరణా, గిరిజారమణా, త్రిశూలధరణా, లోకోద్ధరణా... భజనలు వినుమా, భక్తిని గనుమా || జై ||
డమరుకధారి, విశ్వంభరధారి, ప్రణవనాదఝరి, గజచర్మంభరధారి... చల్లగా చూడుమా, భక్తుల బ్రోవుమా || జై ||
హిమశైల నివసిత, మునిజన వందిత, సురాసుర సేవిత, భక్త జనాహిత... మార్గము జూపుమా, ముక్తినొసగుమా || జై ||

పల్లవి : || మనసంతా ||

|| జై || || జై || || జై ||