Thursday, August 27, 2009

యవ్వనం

కలసిన చూపులు తెరదించెను మౌనం, ఉరకలు వేసే యవ్వనం కోరికల గుర్రాల స్వారీకి ప్రారంభించెను అశ్వమేధం,
అధరంతో అధరం, మధురాతి మధురం, ఒళ్ళంతా పులకించి పలికించేను నరనరం సప్తస్వరం,
స్పర్శ కలిగించేను విద్యుత్ ప్రవాహం, మొదలాయను కౌగిలి బిగిలో జిగి బిగి యుద్ధం, ఆహా! ఇది మరో సాగర మధనం,
కాస్తంత బిడియం, కానీ తాళలేను తనువు తాపం, చల్లని సమీరంలో ఆ సమరం తలపించును భూతలస్వర్గం

Tuesday, August 18, 2009

కావాలి స్వేచ్ఛ

మాతృభాషలోని మాధుర్యాన్ని మరచి, పరాయి భాషలో గొప్పదనాన్ని వెదికే సంస్కృతి నుంచి కావాలి స్వేచ్ఛ ,
క్రీడాస్ఫూర్తి నింపడానికి విదేశీయుల తర్ఫీదుకే ప్రాముఖ్యాన్నిచ్చే పద్దతినుంచి కావాలి స్వేచ్ఛ,
భారతదేశపు ఆర్ధికస్థితి కొన్ని విదేశాల మనుగడపైనే ఆధారపడే స్థితి నుంచి కావాలి స్వేచ్ఛ,
హాలీవుడ్ ని చూసి బాలీవుడ్, టాలీవుడ్ అని పేర్లు పెట్టుకొనే మూస ధోరణి నుంచి కావాలి స్వేచ్ఛ,
చలన చిత్రాలను, రాజకీయాలను, కులమతాలను ఒకేగాడిన కట్టే ఆలోచన నుంచి కావాలి స్వేచ్ఛ,
ఆకలికేకల విలయతాండవం ఒకవైపు, అపరాకుబేరుల విలాసాలు మరోవైపు, ఈ అసమతౌల్యము నుంచి కావాలి స్వేచ్ఛ,
స్వదేశాభివృద్దికి కృషిచేయక, విదేశం భూతలస్వర్గం అనుకొంటూ ఆత్మనింద చేసుకోవడం నుంచి కావాలి స్వేచ్ఛ,
ధనార్జన మత్తులో, కుటుంబానికి సమయం వెచ్చించలేక సాగే ఉరుకుల పరుగుల జీవితం నుంచి కావాలి స్వేచ్ఛ...

Monday, August 17, 2009

నవ భారతం

బానిస సంకెళ్ళు తెంచి స్వేఛ్ఛా వాయువుల్ని ప్రసాదించిన ఎందరో స్వాతంత్ర్యసమరయోధులు, అందరికీ వందనాలు

దేశంలోనైనా మనుగడ సాగించగలం, ఎవరితోనైనా సర్దుకుపోగలం , భిన్న వేషభాషలు అలవరచుకోగలం,కానీ మూస ధోరణికి భిన్నంగా మనమంటే ప్రత్యేక ముద్రవేసే సృజనాత్మకత కావాలి

టాటాల మొదలు, బిర్లా, మిట్టల్, అంబానీల వరకు ప్రపంచ ఆర్ధికస్థితినే శాసించగలిగే మేధావులు ఉన్నారు, కానీ నాణేనికి మరోవైపులా ఇంకా ఉన్న ఆకలి చావులను, ప్రాధమిక వైద్యం లేని ప్రదేశాలను రూపుమాపే మరో వందమంది మేధావులు రావాలి

మత్తగజము కంటే స్థిరమైన ఆర్ధిక స్థితిగల్గిన పలుప్రపంచదేశాలు ఆర్థికమాంద్యం వల్ల విలవిలలాడుతున్నా, భారత ఆర్ధిక స్థితిని సరైన మార్గంలో నడిపించే చాణక్యులు ఉన్నారు, కానీ ప్రపంచ ఆర్ధికస్థితి నీలినీడలు భారతావనిని ప్రభావితం చేసే పరిస్థితిని దూరంచేసే నవచాణక్యులు పుట్టాలి

దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు గురజాడ అప్పారావుగారు, సూత్రాన్ని తూ|||| తప్పకుండా పాటించి భారతీయ ఖ్యాతిని నలుదిక్కులా వ్యాపింపచేసిన భారతీయులకు ఘనత సొంతం,

కానీ నవతరంలో ఉరకలు వేసే యువతరం భారతీయ కీర్తిని ప్రపంచ దేశాలంతా దిక్కులు పిక్కటిల్లేలా కొనియాడే విధంగా కృషిచేయాలని కోరుకొంటున్నాడీ సగటు భారతీయుడు….

Tuesday, August 11, 2009

జీవితాంతం

బోసినవ్వుల పాలబుగ్గల పసి పాపాయిని చూసి, ఇలాగే గడవాలి అనిపిస్తుంది జీవితాంతం

పున్నమి వెలుగుల జల్లులలో, కొసరి కొసరి గోరుముద్దలు పెట్టే అమ్మ ఒడిలో ఒదిగిపోవాలనిపిస్తుంది జీవితాంతం

బుడి బుడి నడకలతో తప్పటడుగులు వేస్తే, సరిదిద్దే నాన్న సంరక్షణ ఉండాలి జీవితాంతం

ఓనమాలు నేర్చుకొని చిట్టి పొట్టి మాటలు పలికితే సంబరపడే అమ్మానాన్నల ఆనందం కావాలి జీవితాంతం

విద్యాబుద్దులు నేర్పించి, క్రమశిక్షణ అలవరచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అధ్యాపకుల ఆశీస్సులు తోడుండాలి జీవితాంతం

గెలుపు ఓటములలో వెన్నుతట్టి నిలిచి, మంచి చెడుల విచక్షణ తెలియజెప్పే మనసైన సహచరులు ఉండాలి జీవితాంతం

కొంటె కోణంగిలతో, చిలిపి చేష్టల్లో, సరదాగా సాగే ఉరకలు వేసే యవ్వనం ఉండే నూనూగుమీసాల వయస్సవ్వాలి జీవితాంతం

పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, పదుగురికి సాయపడుతూ, ఇంతింతై వటుడింతై ప్రపంచఖ్యాతి గడించే తపన ఉండాలి జీవితాంతం

నెమలిలోని హొయలు, కోయిలలోని మాధుర్యం, హంసలోని గుణం, జలకన్యలోని చురుకు కలగలిసిన మగువ తోడుకావాలి జీవితాంతం

మనసిచ్చిన మగువతో రసరమ్యభరితమైన రతిరాసక్రీడల్లో స్వర్గాన్ని తలపించే యవ్వనం సొంతమవ్వాలి జీవితాంతం

ఈ అంతంలేని జీవిత చక్రం ఏ కధకైనా ఓ మంచి సుఖాంతం .......