Tuesday, August 11, 2009

జీవితాంతం

బోసినవ్వుల పాలబుగ్గల పసి పాపాయిని చూసి, ఇలాగే గడవాలి అనిపిస్తుంది జీవితాంతం

పున్నమి వెలుగుల జల్లులలో, కొసరి కొసరి గోరుముద్దలు పెట్టే అమ్మ ఒడిలో ఒదిగిపోవాలనిపిస్తుంది జీవితాంతం

బుడి బుడి నడకలతో తప్పటడుగులు వేస్తే, సరిదిద్దే నాన్న సంరక్షణ ఉండాలి జీవితాంతం

ఓనమాలు నేర్చుకొని చిట్టి పొట్టి మాటలు పలికితే సంబరపడే అమ్మానాన్నల ఆనందం కావాలి జీవితాంతం

విద్యాబుద్దులు నేర్పించి, క్రమశిక్షణ అలవరచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన అధ్యాపకుల ఆశీస్సులు తోడుండాలి జీవితాంతం

గెలుపు ఓటములలో వెన్నుతట్టి నిలిచి, మంచి చెడుల విచక్షణ తెలియజెప్పే మనసైన సహచరులు ఉండాలి జీవితాంతం

కొంటె కోణంగిలతో, చిలిపి చేష్టల్లో, సరదాగా సాగే ఉరకలు వేసే యవ్వనం ఉండే నూనూగుమీసాల వయస్సవ్వాలి జీవితాంతం

పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, పదుగురికి సాయపడుతూ, ఇంతింతై వటుడింతై ప్రపంచఖ్యాతి గడించే తపన ఉండాలి జీవితాంతం

నెమలిలోని హొయలు, కోయిలలోని మాధుర్యం, హంసలోని గుణం, జలకన్యలోని చురుకు కలగలిసిన మగువ తోడుకావాలి జీవితాంతం

మనసిచ్చిన మగువతో రసరమ్యభరితమైన రతిరాసక్రీడల్లో స్వర్గాన్ని తలపించే యవ్వనం సొంతమవ్వాలి జీవితాంతం

ఈ అంతంలేని జీవిత చక్రం ఏ కధకైనా ఓ మంచి సుఖాంతం .......

No comments:

Post a Comment